శ్రీ హరివంశము
పురాణమా లేక ఇతిహాసమా యను మీమాంస యున్నది. పండ్రెండువేల శ్లోకములతో మూడు
పర్వములుగా నున్న హరివంశమును శ్రీవేదవ్యాసమహర్షి మహాభారత గ్రంధమునకు ఖిలభాగముగా
రచించుటచే ఇది ఇతిహాసము. పురాణపురుషుల దివ్యచరిత్ర లుండుటచే ఇది పురాణము.
హరివంశములో అవాఙ్మానస గోచరుడగు భగవంతుడు అవతారవిశేషముగా వచ్చి లీలలు
ప్రదర్శించెను. అవతారమనగా పరబ్రహ్మ పరమాత్మ దిగివచ్చుట. అవతారములన్నియూ
నిత్యము-శాశ్వతము-సర్వగుణ సంపన్నము-పూర్ణజ్ఞాన స్వరూపము-పరమానంద సందోహమైనవే.
జగత్సృష్టికి ముందర భగవంతుడు నారము(జలము) లను సృజించి వానిలో తనశక్తి(వీర్యము) నాధానము చేయుటచే
నారాయణుడయ్యెను. శ్రీమన్నారాయణుని
వీర్యసంజాతమైన జలములనుండియే సృష్టియావత్తు ఉద్భవించి పరిఢవిల్లినది. ఇదియే
హరివంశమునందలి కథావస్తువు. శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకత్వముచే
శ్రీమహావిష్ణువనబడెను. సృష్టివిస్తరణ విధానము నెరిగి మననము చేయువారికి
పుత్రోత్పత్తి, సత్సంతానప్రాప్తియే అవశ్య ఫలసిద్ధి.
శ్రీమహావిష్ణువు
తన లీలావతారములలో విశ్వత్వ - హరిత్వ - వైకుంఠత్వ - శ్రీకృష్ణత్వ - ఈశ్వరత్వములను
ప్రదర్శించెను. జగద్రక్షణార్థమై అవతరించి అభయమిచ్చుట విశ్వత్వము. దురితములను -
దుఃఖములను పోగొట్టునది హరిత్వము.
సర్వసమర్థత కలిగియుండునది వైకుంఠత్వము. సత్తారూపుడైననూ సంసారానందరూపునిగా
అస్తిత్వము ప్రదర్శించునది శ్రీకృష్ణత్వము. నిగ్రహానుగ్రహ శక్తి సంపన్నమైనది
ఈశ్వరత్వము. శ్రీమద్భాగవతము నందు శ్రీమహావిష్ణువుయొక్క శ్రీకృష్ణత్వ -
ఈశ్వరత్వములే ప్రతిపాదించబడినవి. కాని హరివంశములో భగవానుని
విశ్వత్వ-హరిత్వ-వైకుంఠత్వములు కూడ చెప్పబడినవి.
హరివంశ గ్రంధములో
హరివంశపర్వము జగత్సృష్టి - దక్షప్రజాపతిసృష్టి - పృథోపాఖ్యానము - మన్వంతరవర్ణనము -
కాలవ్యవస్థ - సూర్యసంతతి - పితృకల్పము - వైవస్వత, చంద్ర, అమావసు, ఆయు, కాశీరాజ, యయాతి, పూరు, యదు, వృష్ణి, అంధక వంశముల చరిత్రలు వర్ణించబడినవి. అనగా
భగవానుని విశ్వవ్యాపకత్వము ప్రతిపాదించబడినది. భగవదవతారములు - శ్రీకృష్ణావతార
సందర్భము విపులముగా ప్రస్తావించబడినవి. వీనిని స్మరించు మానవుడు సర్వపాప
విముక్తుడగును కావున హరిత్వము నిరూపించబడినది.
విష్ణుపర్వమునందు
భగవానుని వైకుంఠత్వము- శ్రీకృష్ణత్వము పుష్కలముగా వివరించబడినవి. శ్రీకృష్ణునొక
లోకోత్తర మహాపురుషునిగా వర్ణించినది. శ్రీకృష్ణుడు జ్ఞానవిజ్ఞానములకు - నీతినియమములకు నెలవు. తాను ధర్మమునాచరించి ఇతరుల కుపదేశించెను. దుష్టశిక్షణ- శిష్టరక్షణ గావించి ఆదర్శ
పురుషుడయ్యెను. ప్రజల శాంతిమయ జీవనమునకు విఘాతమొనర్చు ముష్కరులను మట్టుబెట్టెను.
దురాచారుల గుండెలలో గుబులు పుట్టించెను. రాజనీతితో ప్రజాపాలకులను సంస్కరించెను. వర్ణాశ్రమ ధర్మములను పునరుద్ధరించెను.
శ్రీకృష్ణుని
జననము-వ్రజవాసము-బృందావన ప్రవేశము-కాళీయ మర్దనము- నరకాసుర నికుంభాది అసుర సంహారము
వీరోచిత లక్షణములు చెప్పినవి. గోవిందపదము-రాజేంద్రపదము శ్రీకృష్ణుని ప్రభుతను
చాటినవి. గోమంతగిరి యుద్ధము-పారిజాతాపహరణము ఆయన యుద్ధకుశలతకు గీటురాళ్ళు.
శ్రీకృష్ణుని "వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ" చతుర్వ్యూహాత్మక
అవతార విశేషములన్నియు "షట్పురవిజయము-ప్రభావతీ
ప్రద్యుమ్నము-శంబరాసురవధ-ఉషాపరిణయము-వరుణ పరాజయములందు కానవచ్చును. ఆయన సాంకేతిక
పరిజ్ఞానము ద్వారకానగర నిర్మాణమునందు తెలియవచ్చును. ఆయన కళాపిపాసకు
పిండారకతీర్థయాత్ర ఒక నిదర్శనము. శ్రీకృష్ణుడు ధర్మజ్ఞుడు.సత్కర్మానుష్ఠానము నందు-దేవతారాధన
యందు శ్రద్ధాతత్పరుడు. శివధ్యానము-తపస్సు
మెండుగా జేసెను. "కృష్ణస్తు భగవాన్ స్వయం" అనునది దక్షిణా వైశిష్ట్యము
యను ఉపాఖ్యానము నందగుపడును.
శ్రీహరివంశ
గ్రంధమునందలి భవిష్యపర్వము శ్రీమహావిష్ణువు యొక్క పరతత్త్వమును ప్రబోధించి
ఈశ్వరత్వమును నిరూపించెను. భవిష్యపర్వములోని కాలప్రభావము - అనంతశయనము -
పుష్కరసంభవము - బ్రహ్మయోగము - బ్రహ్మయజ్ఞము - ఆత్మజ్ఞానము - ధర్మవిజయము
పరతత్త్వోపదేశములై యున్నవి. అటులనే యజ్ఞవరాహావతారము - నృసిమ్హావతారము -
వామనావతారము - దేవాసురసంగ్రామౌ - బలివిజయము అనుశీర్షికలు మిక్కుటముగా ధర్మప్రబోధము
చేసినవి. ఘంటాకర్ణుని చరిత్ర పరాభక్తికి మచ్చుతునక. శివకేశవులనెడి శీర్షిక సర్వమత
సమానత్వమును చాటి చెప్పినది.
పదునెనిమిది
పురాణములు వినుటవలన లభించు పుణ్యము కేవలము ఒక్కసారి హరివంశము చదువుటవలన లభించును.
హరివంశ శ్రవణముచే పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనము
లభించును. మహాపాతక-ఉపపాతకములు నశించును.
హరివంశమును చదువువారు వినువారు కష్టములనుండి గట్టెక్కెదురు. వారికి సర్వశుభములు
కలిగి మనోవాంఛితములన్నియు తీరును. వేయి అశ్వమేధయాగములు, వంద వాజపేయయాగములు చేసిన ఫలము గలుగును. శ్రీహరివంశగ్రంధములోనున్న
పదిస్తోత్రములు అనుబంధముగా నీయబడినవి. యోగమాయాదేవిస్తుతి - శివస్తోత్రము -
బిల్వోదకేశ్వర స్తోత్రము - ఆహ్నికస్తోత్రము - ఆర్యాస్తవము - హరిహరాత్మక స్తోత్రము
- నృసింహ స్తోత్రము - పరమపురుషస్తవము - మోక్షవింశక స్తోత్రము - విష్ణుస్తుతి
యనినవి కోరిన కోర్కెలు తీర్చు స్తోత్రరత్నములు.
Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books
Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam
No comments:
Post a Comment