Wednesday, October 26, 2016

Ribhu Gita in Telugu now available

ఋభుగీత 

Rubhu Geeta by Sri Saripalle Venkata Subrahmanya Somayaji


Rubhu Geeta

Rubhu Geeta is the Adhyatma Jnana passed as parampara from Shiva to Skanda to Jaigeeshavya. Maharshi Ribhu has also got this jnana by the grace of goddess Annapurna Devi.  This Shiva-Advaita text has then become popular as Rubhu Geeta. Sri Somayaji's Rubhu Geeta book consists Annapurna Upanishat also. Annapurnopanishat is considered as the extract of the Rubhu Geeta. Bhagawan Sri Ramana Maharshi also taught this to his disciples and advised them for regular recitation of Rubhu Geeta.


Buy Rubhu Geeta in India at Amazon and Flipkart
Buy Rubhu Geeta in USA Amazon
Also watch the video about Adhyatma Geetas

Other Books by Sri Saripalle Venkata Subrahmanya Somayaji

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam


ఋభుగీత - తొలిపలుకు

నేను నేనైతే ....
- బ్రహ్మశ్రీ, సరిపల్లె వేంకట సుబ్రహ్మణ్య సోమయాజి

“పునరపి జననం పునరపి మరణం" - జీవుడు పాతబడిన దేహమును వదిలిపెట్టాడు. నిష్కామ కర్మలు చేయలేదుగా, కర్మ ఫలములు వదిలిపెడతాయా! మరొక జన్మకోసము మళ్ళీ ఆరాటము. చంద్రలోక (పితృలోక) ప్రయాణము ప్రారంభమయింది. తాను చేసిన సత్కర్మలను ఏకరువు బెట్టుచూ ఎందరెందరో పితృదేవతలను వారివారి వంశాలలో జన్మించడానికి ప్రాధేయపడ్డాడు. కొందరు ఏమీ విననటుల ఉదాసీన వైఖరి జూపారు. కొందరు ఆలోచిస్తామన్నారు. కొందరు ససేమిరా కాదన్నారు. ఈ జీవుని ఘోషను విని ఒకరు ద్రవించి స్పందించారు. వారి ప్రజాతంతువును పరిరక్షిస్తానని ప్రమాణము చేయమన్నారు. వారి కులమునకు, కుటుంబమునకు పేరు ప్రతిష్టలు తెస్తానని ప్రతిజ్ఞ చేయించారు. అలా మొదలైంది. యీ జీవుని నూతన దేహధారణ యాత్ర. అగ్ని వాహకుడనై మరల చంద్రలోకం నుండి గగనాంతరములోనికి వచ్చాను. సప్తవాయు మార్గాల ద్వారా అంతులేని ప్రయాణం సాగించాను. నీలాంబరములో వ్రేలాడుచున్న నల్లని దట్టమైన మేఘపంక్తులలో దూరాను. ఒక చినుకులో దాగాను. గాలివాటుకు మేఘపంక్తులు కదిలాయి. ఎగిరెగిరి ఒక చోట పంట పొలాలలో వర్షధారలు కురిపించాయి. నేనొక ధాన్యపు కంకులోనుండి బియ్యపు గింజనై ఒక గృహస్థు ఇంటికి చేరాను. పాత్రలో ఉడికి అన్నము మెతుకునయ్యాను. గృహయజమాని అన్నముముద్ద ద్వారా జీర్ణాశయములోనికి పోయాను. అదృష్టం కొద్దీ ఆయన వీర్య కణాలలో ఒకటయ్యాను. ఇతర అనేక కణాలతో పోటీపడి ఎట్టకేలకు గృహిణిశోణితములో చేరి గర్భస్థ పిండమునైనాను. మళ్ళీ మళ్ళీ గర్భనరకం అనుభవించాను. యథా సమయమున నూతన దేహధారణతో యీ విశాలలోకములో జన్మించాను.

“అగ్నిర్మ జన్మనా” - పుట్టిన జీవులందరు అగ్ని నామధేయులైననూ యీ లోకములో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుటకు నాకొక పేరు పెట్టారు. బాలారిష్టాలు అధిగమించాను. వేదోక్త సంస్కారములు ఒక్కొక్కటి చేయించుకున్నాను. అక్షరాలు దిద్దాను. పదాలు పలికాను. వాక్యాలు చదివాను. కవితలు అల్లాను, పాటలు పాడాను. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలనభ్యసించాను. జీవన పోరాటము మొదలయ్యింది. కూటికొరకు కోటి తిప్పలు. ఉద్యోగాలు చేశాను. యౌవ్వనపు పొంగులు, ఆశలు, ఊహలు నన్ను రంగుల హర్మ్యాలలో విహరింపజేశాయి. సంసారినయ్యాను. సంతానమును కన్నాను. బంధుబలగము, మిత్రవర్గము పెంచుకున్నాను. ఎన్నెన్నో మజిలీలు. ఏవేవో ఊళ్ళుతిరిగాను. కుటుంబపోషణ, బాధ్యతలతో సతమతమయ్యాను. కొందరిచే అవమానించబడ్డాను. కొందరి ద్వారా సన్మానాలు పొందాను. కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నాయి.

జీవన యానములో ఒడిదుడుకుల ఎత్తు పల్లాలు చవిజూస్తున్నాను. పాపం పుణ్యం తెలుస్తున్నాయి. దేవుళ్ళు మొక్కులు అలవాటవుతున్నాయి. నోములు, వ్రతాలు, ఆరాధనలు, ఉపవాసాలు ఆచరిస్తున్నాను. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తున్నాను. కొంత ఆధ్యాత్మికత అలవడుతున్నది. ఇతిహాసాలు, పురాణాలు తిరగవేస్తున్నాను. వేదాంతం ఒంటపడుతోంది. ప్రవచనాలు వింటున్నాను. ఉపనిషదర్ధాలు తెలుసు కుంటున్నాను. అధ్యాత్మ గీతలనధ్యయనము చేస్తున్నాను. ఒకప్పుడు మహావాక్యార్ధ ఋభుగీతను చదివి మహదానందము చెందాను.

ఋభుగీతను బ్రహ్మమానస పుత్రుడగు ఋభు మహర్షి రచించెను. ఇందులో ప్రధానముగ “అహంబ్రహ్మాస్మి"యను మహా మంత్రము ఉపదేశించబడినది. ఋభు మహర్షి మస్తిష్కములో అన్నపూర్ణాదేవి అనుగ్రహించిన జ్ఞానమిది. ఆమె ధరించిన బంగారు పాత్రలో జ్ఞానపయస్సుతో నిండిన అద్వైతామృత పాయసాన్నమిది. “భిక్షాందేహి మాతాన్నపూర్ణేశ్వరి”యని ప్రార్ధించిన వారందరికి ఆమె పంచియిచ్చు ప్రసాదమిది. “నేనెవరిని ?” అని ప్రశ్నించుకొను వారందరికి యీ జ్ఞానామృత పాయసము తుష్టి పుష్టులనిచ్చును.

"నేను" ఎవరో తెలుసునా ? ఆత్మదేవుడను. సర్వత్రా నేనే వ్యాపించి యున్నాను. ఆబ్రహ్మకీట పర్యంతము నేనే యున్నాను. బ్రహ్మవిష్ణు మహేశ్వరాది దేవతలందరి యందును నేనే యుంటిని. చరాచరము లందంతట నేనే యున్నాను. ఏదైనా వస్తువును సృజించిన పిమ్మట అందులో నేను “ఆనుప్రవిశ్య" ప్రవేశించుట యదార్థముగాదు. నేనునుండియే ఆ వస్తువు తయారయినది. విత్తునే నేనైన పిమ్మట మహావృక్షముగ ఎదిగితిని. భగవద్గీత విభూతి యోగములో “అంతానేనే, అన్నీనేనే” యనుదాని అర్థము నాకిప్పుడు అవగతమైనది. ఇచట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన "నేను" (తాననిగాదు) ఆత్మ అనియే అర్థము. విశ్వరూప సందర్శనము కూడ విశ్వప్రదర్శనముగాదు. నేను యొక్క విజృంభణమే. ఆత్మననుకొన్న దధీచి మహర్షికూడ శ్రీమహావిష్ణువునకు విశ్వరూప సందర్శనమును చేసి చూపించెను.

నేను యున్న చోట నీవు లేనేలేదు. నీవు యనునది ద్వైత భావనయే. నేను కేవలుడను. ఏకమాత్రుడను. ఈ కేవలత్వమే కైవల్యము. కేవలత్వము సిద్ధించుటకు ఆత్మతత్త్వము అవగతము కావలెను. అందుచేతనే “జ్ఞానాదేవతు కైవల్యమ్" యని వేదాంతభేరి మ్రోగుచున్నది. పురుషోత్తమప్రాప్తి యోగము ఆత్మప్రాప్తినే ఉపదేశించినది. ఆ పురుషోత్తముడు పురములందే శయనించియున్నాడు. జీవుని నిష్కామ కర్మయోగమునకు ప్రేరేపించునదియే కర్మయోగము. “నేతినేతి” ఆత్మాన్వేషణయే కర్మసంన్యాస యోగము. సర్వము తానైనపుడు తాను వాంఛించునది ఏముండును? ఇది కర్మ ఫలములపై విరక్తి భావమే గదా. కర్మఫలము అవశ్యము భోగించవలసినదియే. ఆత్మ తత్వము చెంత భోక్త భోగములుండవు. కనుక వానిని వర్ణించవలెను.

అర్జున విషాదయోగమాదిగా పదునెనిమిది అధ్యాయములు సోపాన క్రమముగ "నేను" తత్వమునే ప్రబోధించినవి. యోగమనగా జీవబ్రహ్మల కలయిక. యోగముల సమగ్రకలయికయే ఆత్మయోగము. ఆత్మయోగికి సర్వము ఆత్మమయమే. అనాత్మ వస్తువనునది లేదు! నీవు - వాడు అను భేదములేదు. అందుచేతనే సర్వప్రాణలలో తనను, తనలో సర్వప్రాణులను దర్శించును.

"నేను" మంత్రార్ధమును శ్రీరమణ మహర్షి ఈ విధముగనే బోధించి ఋభుగీత పారాయణమును తన శిష్యులకు భక్తులకు నిర్దేశించిరి. ఋభుగీతలోని ప్రకరణములన్నియు ఆత్మ తత్వమునే గానాలాపన చేసినవి. ఆయా గీతములను నిత్యము మననము చేయు శ్రద్ధాళువులగు సాధకులు అవశ్యము ఆత్మస్వరూపులయ్యెదరు. ఉపనిషద్భావ పరంపర అంతయు ఆమూలాగ్రము ఋభుగీత యందు నిక్షిప్తమైయున్నది. “అంతా మిథ్య దలంచిచూడ"యను ధూర్జటి తెనుగుపద్య నానుడికి ఋభుగీత సమగ్ర వ్యాఖ్యానము చేసినది. మిథ్యయనగా ఏదీ లేదని గాని, భ్రమయనిగాని అర్ధముగాదు. సర్వము ఆత్మమయమైనపుడు వేరొకటిగా దలంచుట మిథ్యగాక మరేమి? ఆత్మజ్ఞానికి వేరొక వస్తువుయున్నదను తలంపులేదు. సర్వత్రా అద్వైతమునే దర్శించును. “నేను”కు కులములేదు. జాతిలేదు. మతము లేదు. మాతాపితరులులేరు. స్త్రీ పుంలింగ భేదము లేదు. ఉచ్ఛనీచములు లేవు. ధర్మాధర్మములు లేవు. సుఖదుఃఖములు లేవు. మానావమానములు లేవు. ప్రియాప్రియములు లేవు. బోధప్రబోధములు లేవు. గురు శిష్యులు లేరు. దేవీ దేవతలు లేరు. సాధన చతుష్టయ సంపదలు లేవు. సర్వత్రా అద్వయమగు ఆత్మ తత్వమేయున్నది. ఆంతా నేనే. అన్నీ నేనే. ఆహా! ఈ ఆత్మ తత్త్వవిచారమెంత సుమధురము, మహదానందమో గదా! నేను నేననుభావముతో నేనెపుడయ్యెదనోగదా! మరి నేను నేనైతే.

ఇట్లు
నేను.
సరిపల్లె వేంకట సుబ్రహ్మణ్య సోమయాజి

No comments:

Post a Comment