వేదశాఖలందున్న
జ్ఞానకాండయే ఉపనిషత్తులు. ఇవి చిరప్రదీప్త జ్ఞానదీపికలు. ఇవి సృష్ట్యాది నుండి
లయపర్యంతము ప్రకాశించునవి. వీని ప్రకాశములో అమరత్వమున్నది. ఏది సమస్త అనర్థముల
నుత్పన్నము చేయు సంసారమును నాశనమొనర్చునో, ఏది సంసారమునకు కారణభూతమగు అవిద్యను శిధిలమొనర్చునో, ఏది బ్రహ్మప్రాప్తికి ఉపకరించునో అదియే
ఉపనిషత్తు అని దార్శనికులు వర్ణించిరి. ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతము. అనగా
వేదములయొక్క సిద్ధాంతమును, చరమ తాత్పర్యమును
వర్ణించునవని అభిప్రాయము.
వేదము స్వయముగా
అనంతము. వేదశాఖలు కూడ అనంతము. కనుక వేదోపనిషత్తులు కూడ అనంతములనుటలో
ఆశ్చర్యమేమున్నది? కాని వేదశాఖలుకూడ
అనేకము విలుప్తములగుటచే చాల ఉపనిషత్తులు కూడ కాలగర్భములో కలిసిపోయినవి. ప్రస్తుతము
నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే లభ్యమగుచున్నవని ముక్తికోపనిషత్ చెప్పినది. ఆ నూట
ఎనిమిది ఉపనిషత్తులలో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ,
ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకమను పది ఉపనిషత్తులు మాత్రమే గంభీరతర
అర్థప్రతిపాదికములై యున్నవి. వీనినే పూర్వాచార్యులు బ్రహ్మవిద్యకు ప్రమాణభూతములుగా
నెంచిరి. వీనిలో మాండూక్యోపనిషత్ అతిచిన్నది. బృహదారణ్యకోపనిషత్ అతిపెద్దది. బృహదారణ్యక,
ఛాందోగ్యోపనిషత్తులలో
అన్య ఉపాసనా విశేషములు ఉల్లేఖించిననూ అవి బ్రహ్మము-ఆత్మ యొక్క ఏకత్వమునే
ప్రధానముగా బోధించినవి. ఉపనిషత్తులలో ప్రతిపాదించిన జ్ఞానమే అన్నిటికన్న
ఉత్కృష్టమైనది. మానవులకు కర్మ-ఉపాసన-జ్ఞానోపదేశముల ద్వారా అధ్యాత్మ పథముపై
నడిపించుటయే వేదముయొక్క ముఖ్యోద్దేశము. ఎవరు ఏ అవస్థలోనున్ననూ వారిని ఆయా
అవస్థలనుండి అధ్యాత్మ ప్రగతికి గొనిపోవుటయే వేదము యొక్క లక్ష్యము.
ఉపనిషత్తులలో
ప్రధానముగా ఆత్మజ్ఞాన నిరూపణయే యున్ననూ కర్తవ్యోపదేశము లెన్నియో ఉదహరించబడినవి.
అవియన్నియు పరమహితకరములు. అధ్యాత్మవిద్యయే సర్వదుఃఖములను నివృత్తిచేయును. అవియే
పరమానందరూప మోక్షమును ప్రాప్తింపజేయును. అందుచే బ్రహ్మవిద్య ప్రతిపాదకమగు
ఉపనిషత్తులు సమస్త విద్యలలో శ్రేష్ఠములని చెప్పబడినవి. అందుచే ఈ దశోపనిషత్తులను
ఆదిశంకరుల భాష్యము ననుసరించి అందరికి అర్థమగు రీతిలో తెనుగు వచనముగా రచించబడినది.
ఉపనిషత్ బోధ
పొందిన జ్ఞానికి ఇంక తాను తెలుసుకొనవలసినది గాని, పొందవలసినదిగాని యుండదు. ఆవిధముగ జ్ఞాని
కృతకృత్యుడై నిత్యబోధమయ నిజస్వరూపమునందు ప్రతిష్ఠితుడగును. అతడు సచ్చిదానందమును సర్వత్రా అనుభవించును.
అట్టివాడే జీవన్ముక్తు డనబడును. జీవన్ముక్తుడు పరమానంద లాభమును పొంది
బ్రహ్మముయొక్క అద్వితీయ చిన్మయసత్తలో ప్రవేశించును. అతడు బ్రహ్మీభూతస్థితిని
పొందును. జీవ - బ్రహ్మైక్య - జ్ఞాననిష్ఠలకు అదియే చివరిహద్దు. అదియే ఉపనిషత్ జ్ఞానము యొక్క పరాకాష్ట. భారతులారా మేల్కొనుడు. వేదమాత మిమ్ములను
మేల్కొలుపుచున్నది. మీరు భారతఖండములో భారతభూమిలో జన్మించితిరి. ఇదొక మహద్భాగ్యము.
అద్యాత్మవిద్య - బ్రహ్మవిద్య మీ గృహస్థ నిధులు.
వానిని ఇచ్చ్ఛానురీతిని వినియోగించి శాశ్వతసుఖశాంతులు పొందుడు. దుఃఖములను
దూరమొనర్చుకొనుడు. పరమోజ్జ్వల శాంతిపథముపై పయనించి ఆత్మోన్నతి పొందుడు.
CONTENTS
ఈశావాస్యోపనిషత్ Ishavasyopanishat
కేనోపనిషత్ Kenopanishat
కఠోపనిషత్ Kathopanishat
ప్రశ్నోపనిషత్ Prashnopanishat
ముండకోపనిషత్ Mundakopanishaat
మాండూక్యోపనిషత్ Maandookyopanishat
తైత్తిరీయోపనిషత్ Taittireeyopanishat
ఐతరేయోపనిషత్ Aitareyopanishat
ఛాందోగ్యోపనిషత్ Chamdogyopanishat
బృహదారణ్యకోపనిషత్ Bruhadaaranyakopanishat
For Sweataswatara Upanishat,
For Annapurna Upanishat,
Look at Rubhu Geeta book by Sri Saripalle Venkata Subrahmanya Somayaji
Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books
Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam
No comments:
Post a Comment