Tuesday, October 20, 2015

అధ్యాత్మగీతారత్నావళి- గ్రంధకర్త మాటలలో

ఆర్షవాజ్ఞ్మయములో ఆత్మజ్ఞాన ప్రబోధకములగు అనేక ఋషిప్రోక్త గీతలున్నవి. ఇవి పురాణేతిహాసములందు పలుచోట్ల వివిధ సందర్భములలో సంవాదరూపముగ ప్రస్తావించబడినవి. గీతలన్నిటిలో శ్రీకృష్ణార్జున సంవాదరూప భగవద్గీత మకుటాయమానమై ప్రసిద్ధి చెందినది. వేదధర్మమునందు భేద, అభేద ఉపాసనలు, సగుణ నిర్గుణ తత్త్వములు ప్రతిపాదించబడినవి.  ఆయా తత్త్వోపాసనా బోధనలను ఋషిపరేణ్యులెందరో ఉపబృంహణమొనర్చి ప్రవచించినవే గీతలుగా విలసిల్లినవి. ఋషిప్రోక్త గీతలన్నియు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, మహావాక్య బోధలలోనున్న నిగూఢ గంభీరతత్త్వము నర్థము చేసికొనుటకు బహుధా ఉపకరించును. పురాణేతిహాసములను తరచిజూచి సుమారు అరువదిగీతలు సంగ్రహించితిని. వానిలో పదునారు గీతలను మహాభారత ఇతిహాసమునుండి గ్రహించి ఈ సంపుటము రచించబడినది. వీనిలో కొన్నిగీతలకు బ్రహ్మవిద్వరేణ్యుల వ్యాఖ్యానములున్నవి. ఆయా వ్యాఖ్యానములను పరిశీలించి చిత్సుఖానందము గలుగునటుల సరళ వివరణ ఈయబడినది. వీనిలో కొన్నిగీతలు ప్రసిద్ధనామములతో ప్రచారము నందున్నవి. తదితర గీతలకు విషయ ప్రాశస్త్యము ననుసరించి సంజ్ఞాచిహ్నముగ నామములు యీయబడినవి.  
ఈ సంపుటములోని భృగుగీత, సనత్సుజాతగీత, అధ్యాత్మజ్ఞానగీత, మనుగీత, మోక్షగీత, మంకిగీత, బోధ్యగీత, అజగరగీత, పంచశిఖగీత, శ్వేతకేతుగీత, వ్యాసగీత, షద్జగీత, పింగళాగీత, ఆత్మకల్యాణగీత, శంపాకగీత, వృత్రగీత యున్నవి. భృగుగీతలో జగత్సృష్టి, జీవుల వర్ణవిభాగము, శౌచాశౌచముల విధానము, ధర్మాధర్మముల విభాగము, పరలోక గమనరీతి వివరించబడినవి. సనత్సుజాతగీతలో "మృత్యుర్నాస్తీతి - మృత్యువు లేనేలేదు"  అను సిద్ధాంతము ప్రతిపాదించబడినది. అధ్యాత్మజ్ఞానగీత చరాచర సృష్టి గురించి, ధ్యానయోగ జ్ఞానము గురించి ప్రస్తావించినది. మనుగీతలో కామనాత్యాగము, జ్ఞానప్రశంస, పరబ్రహ్మతత్త్వ నిరూపణము, ఆత్మతత్త్వ విచారణము, బుధ్యాది ప్రకృతుల వివేచనము, ఆత్మసాక్షాత్కార ఉపాయములు, ఆత్మయొక్క నిత్యత్వము, పరబ్రహ్మప్రాప్తి మున్నగునవి వర్ణించబడినవి. మోక్షగీతలో జీవాత్మస్థితి, సత్వగుణ సంసేవనము, విషయాసక్తి త్యాగము, బ్రహ్మచర్య వైరాగ్య లక్షణములు, బ్రహ్మప్రాప్తి యత్నముబ్రహ్మప్రాప్తి కొరకు సాధనోపాయములు బోధించబడినవి. మంకిగీత మానవునకు సుఖోపాయములు చెప్పినది. శాంతి లభించుం మార్గమును బోధ్యగీత సూచించినది. జనకమహారాజు భోగములను పరిత్యజించి ఎట్టి ధర్మాచరణముతో మోక్షమును సాధించెనో పంచశిఖగీత చెప్పినది. గృహస్థాశ్రమవర్తి యైనను సంయమ నియమములతో సమస్త సాంసారిక బంధముల నధిగమించి ద్వంద్వరహితుడై ముక్తిని సాధించుకొను విధానమును శ్వేతకేతుగీత బోధించినది. వ్యాసగీతలో కాలస్వరూపము - సృష్టి ప్రళయములు - బ్రాహ్మణకర్తవ్యము - ధ్యానయోగము - వైరాగ్యము - కర్మతత్త్వ వివేచనము - జ్ఞానసాధనలు - యోగసాధన - చతుర్విధ ఆశ్రమ ధర్మములు - పంచభూత తత్త్వ వివేచనము - ప్రకృతిపురుష వివేకము - బ్రహ్మవేత్త లక్షణములు - పంచభూత కార్యములు - ముక్తి ఉపాయము - పరమాత్మ సాక్షాత్కారము విపులీకరించబడినవి. షడ్జగీత ధర్మార్థకామముల శ్రేష్ఠతను వానిని సాధించు విధానమును చెప్పినది. శోకనివృత్తి ఉపాయమును పింగళాగీత బోధించినది. త్యాగమహిమనుగూర్చి శంపాకగీత  చెప్పినది.

అధ్యాత్మగీత లన్నియు జ్ఞానవిజ్ఞాన బోధకములు. సుఖజీవన సాధనకు మార్గదర్శకములు. ఇహపరలోక శాంతిప్రదాయక బోధకములు. బ్రహ్మప్రాప్తికి జ్ఞానప్రదీపికలు. ఈ గీతలలో ఏ ఒక్కగీత ననుసరించిననూ మానవుడు దైవీగుణ సంపత్తితో వర్ధిల్లును. ఈ గీతలను నిత్యపారాయణ మొనర్చు సజ్జనులు సౌహార్ద్రభరితులై అవశ్యము మోక్షాధికారు లగుదురు.

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's All Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

No comments:

Post a Comment