శ్రీవేదవ్యాస
మహర్షి రచించిన అష్టాదశ పురాణములలో శ్రీమద్దేవీభాగవతము గొప్ప ప్రాశస్త్యము
సంతరించుకొన్నది. సచ్చిదానంద స్వరూపమగు పరమాత్మను స్త్రీరూపముగ, పురుషరూపముగ, కేవల నిరాకారరూపముగ ధ్యానించవచ్చును.
పరబ్రహ్మము శక్తియే బ్రహ్మాండములను నిర్మించి- పోషించి- తన ఇచ్ఛామాత్రముచే
చరాచరజగత్తునూ లయింపజేయుచున్నదని దేవీభాగవతము ప్రతిపాదించినది. దేవీస్వరూపము
సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మతత్త్వమే.
తత్త్వసాధకులను ప్రకృతిశక్తి నుండి మహాపురుష ఆరాధనకు ప్రేరేపించిటయే
దేవీభాగవత ముఖ్యోద్దేశము. గాయత్రీమంత్రార్థమునే అనేక కథలద్వారా దేవీభాగవతము
చెప్పినది. అందుచేతనే "సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం, నమామి హ్రీం మయీం దేవీం ధియోయోనః ప్రచోదయాత్" యను శ్లోకముతో పురాణ
సమాప్తి గావించబడినది.
"సర్వం
ఖల్విదమేవాహం నాన్యదస్తి సనాతనం" యను అర్థ శ్లోకమే "అహం
బ్రహ్మాస్మి" యను మహావాక్యము. వేదసారమైన ఈ మహావాక్యమునే వ్యాసమహర్షి
దేవీభాగవతరూపముగ వ్యాఖ్యానించెను. భగవదుపాసన రెండు విధములుగా నున్నది. సగుణోపాసన అనగా దేవతా స్వరూపములను, వారి లీలలను, గుణగణములను, ఆయా దేవతామంత్రములను, స్తోత్రములను, పూజించి, జపించి, స్తుతించి
ఆరాధించుట. నిర్గుణోపాసన అనగా నిరాకార నిర్వికార భగవద్ధ్యానము.
సగుణోపాసన సంసారులకు, నిర్గుణోపాసన
సంన్యాసులకు నిర్ణయించబడినది. దేవీభాగవతము మిక్కుటముగా సగుణోపాసన ద్వారా
భగవత్తత్వమును ప్రతిపాదించినది.
శ్రీదేవీభాగవతము
పదునెనిమిదివేల శ్లోకములతో పండ్రెండు స్కంధములుగా విభజించబడినది. ఈ భాగవతము
నంతటినీ యథాతథము తెనుగువచనము చేయబడినదె ఈ గ్రంధము. ఇందులో ఎన్నియో ఉపాఖ్యానములున్నవి.
ఇవియన్నియు తత్త్వవిమర్శను, తత్త్వబోధను, సంక్షిప్తముగా
సంగ్రహించి చెప్పినవి. నీతిని-ధర్మమును బోధించినవి. సదాచారమును-సత్కర్మలను
వివరించినవి. దుష్కర్మలను-దురితములను విశదీకరించి ఖండించినవి.
కర్మయోగ-జ్ఞానయోగ-భక్తియోగములను విపులీకరించినవి. పురాణములను పూర్వచరిత్రలుగా
స్మరించునపుడు వానిలోని నిగూఢ తత్త్వమును గ్రహించి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు
ప్రయత్నించవలెను. మహాత్ముల చరిత్రలలోని సందేశములకే ప్రాముఖ్యతనీయవలెను.
సంభవాసంభవముల గురించి తర్కించుట శుష్కప్రయోజనమే అగును. ధర్మసూక్ష్మమునెరిగి
ధర్మాచరణమునందు అనురక్తులు గావలయును.
No comments:
Post a Comment